టీడీపీ అధినేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుతో పాటు పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు విజయవాడలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. అయితే, పాత ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని, తాజా ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసి ఆయనపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నతో పాటు 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది.
వారిని ప్రతివాదులుగా చేరుస్తూ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జడ్జిలు, క్రింది కోర్టు జడ్జిలపై దూషణలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీరామ్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులను దూషిస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ కోరారు. సోషల్ మీడియాలో జడ్జిలపై ట్రోలింగ్ జరుగుతుందని, అవి క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయని చెప్పారు. దీంతో 26 మందికి నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ నాలుగు వారాలు పాటు వాయిదా పడింది.
మరోవైపు, రాష్ట్రపతి భవన్ నుంచి ఏపీ సిఎస్ జవహర్ రెడ్డికి ఇదే విషయంపై లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు రాష్ట్రపతికి లేఖ రాశారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, చర్యలు చేపట్టాలని ఏపీ సి ఎస్ కు రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పిసి మీనా లేఖ రాశారు.