ఎర్రచందనం స్మగ్లింగ్, నిరోధం, నమోదవుతున్న కేసులు, విచారణ తదితరాలపై హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది. ఎర్రచందనం నిరోధానికి, కేసులు నమోదు, విచారణ తదితరాలను వెంటవెంటనే తేల్చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అధికారులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎర్రచందనం స్మగ్లర్లతో పోరాటాలు చేస్తున్నారు. పట్టుకునే సరుకును పట్టుకుంటున్నారు. వెళ్ళిపోయేది వెళ్ళిపోతోంది. పట్టుకున్న సరుకు విషయంలో అయినా కేసులు నమోదుచేసి వెంటనే విచారణ జరిపి స్మగ్లర్లకు ఎందుకు శిక్షలు పడటంలేదని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది.
స్మగ్లర్లు స్వేచ్చగా బయట తిరుగుతున్నారని వాళ్ళకి పోలీసులన్నా, ప్రభుత్వం, కోర్టులంటే భయమే ఉండటంలేదని తీవ్రమైన వ్యాఖ్యలుచేసింది. దీనికి కారణం ఏమిటంటే దశాబ్దాలు గడచినా కేసుల దర్యాప్తు సక్రమంగా జరగటంలేదు. ఒకవేళ కేసులను కోర్టుల్లో ప్రవేశపెడుతున్నా విచారణకు సంవత్సరాలు పడుతోంది. దీనివల్ల ఏ ఒక్క కేసు కూడా వెంటనే ఫైనల్ కావటంలేదు. పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణల్లో ఆలస్యం లాంటి అనేక అంశాలు స్మగ్లర్లకు అనువుగా మారిందని హైకోర్టు గ్రహించింది.
అందుకనే 2001లో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల దర్యాప్తు, విచారణ మొత్తానికి సిట్ ను నియమించింది. ఇకనుండి స్మగ్లింగ్ వ్యవహారాలు మొత్తాన్నే సిట్ చూసుకుంటుందని ఆదేశించింది. జిల్లాల్లో ప్రిన్సపల్ సివిల్ జడ్జీలు, మెజిస్ట్రేట్ కోర్టుల్లో జడ్జీలు కూడా సిట్ సహకరించాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. సిట్ కు హైకోర్టు మెజిస్టీరియల్ పవర్స్ ఇచ్చింది. దీనివల్ల సిట్ ఎవరినైనా విచారణకు పిలిపించుకుని విచారించే అధికారులు వచ్చాయి.
పోలీసులు, అటవీ, టాస్క్ ఫోర్స్ విభాగాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తీసుకునే అధికారాలను హైకోర్టు సిట్ కు కల్పించింది. ఎర్రచందనం ఇంత యధేచ్చగా స్మగ్లింగ్ జరుగుతోందంటే అందుకు ప్రభుత్వాలతో ఎలాంటి సంబంధంలేదు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా అందులోని కీలక వ్యక్తుల్లో కొందరు స్మగ్లర్లకు సహకరిస్తున్న కారణంగానే పోలీసులు, అటవీ, టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. స్వేచ్చ దొరికినపుడు అటవీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ పవర్ ఏమిటో స్మగ్లర్లకు చూపుతునే ఉన్నారు. మరి హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఏమి జరుగుతుందో చూడాలి.