హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చి వేస్తూ.. సంచలనం సృష్టిస్తున్న హైడ్రా పై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరును కోర్టు తప్పుబట్టింది. కూల్చివేతలు చట్ట విరుద్ధమంటూ.. దాఖలైన పదు ల సంఖ్యలో పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా ఏర్పాటును సమర్ధించినా.. పనితీరును మాత్రం తీవ్రంగా దుయ్యబట్టింది.
శని, ఆదివారాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాల సమయంలో కూల్చి వేతలు చేపట్టడం ఎందుకని ప్రశ్నించిన హైకోర్టు.. ఉరి శిక్ష పడిన దోషికి కూడా.. చివరి అవకాశం ఇస్తారని పేర్కొంది. ఆక్రమించుకుని ఇళ్లు, భవనాలు నిర్మించారంటూ.. కూల్చి వేతలు చేపడుతున్న వారికి మీరు ఎలాంటి అవకాశం ఇచ్చారని హైడ్రా కమిషనర్‌ను నేరుగా ప్రశ్నించింది. సోమవారం జరిగిన విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్.. వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై నిశిత విమర్శలు గుప్పించింది.
వీకెండ్లో కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. తహసీల్దార్ బులడోజర్లు ఇవ్వమని అడిగారని, అందుకే వాటిని పంపించామని పొంతనలేని సమాధానం చెప్పడంతో రంగనాథ్‌కు వార్నింగ్ ఇచ్చింది. “అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకపోతే.. ఇంటికి వెళ్లిపోతారు“ అని న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. దీంతో రంగనాథ్ మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు.. వీకెండ్లో కోర్టులు పనిచేయని రోజులను చూసుకుని కూల్చి వేతలు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు గతంలోనే నిషేధించిన విషయం తెలియదా? అని నిలదీసింది.
హైడ్రా చేస్తున్న వీకెండ్ చర్యలను సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎందుకు పరిగణించరాదని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. పేదలు మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టుకుని చేసుకున్న నిర్మాణాలను కూల్చేముందు.. ఆలోచించుకున్నారా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి.. ఏవిధంగా ఈ కూల్చి వేతలను సమర్ధించలేమన్నారు. అనుమతులు ఉన్నా.. పట్టించుకోకుండా కూల్చి వేయడం ఏంటన్నారు. హైడ్రా పనితీరు మారకపోతే.. అధికారులు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని హెచ్చరించారు.
అంతేకాదు.. హైడ్రా అంటే.. కేవలం కూల్చివేతలే కాదని.. ట్రాఫిక్‌ను కూడా క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆమేరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. “చట్టప్రకారం నడుచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నేతలు చెప్పారనో, పై అధికారులు ఆదేశించారనో అత్యుత్సాహంతో పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడతారు“ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.