టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సిఐడి అధికారులు కొద్దిరోజుల క్రితం హడావిడి చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఇంట్లో లేని సమయంలో వచ్చిన సిఐడి అధికారులు ఆయన పిల్లలను ప్రశ్నించడం వివాదానికి దారి తీసింది. అంతేకాదు, విజయ్ గురించి ఆరా తీస్తూ ఆయన డ్రైవర్ పై సిఐడి అధికారులు చేయి చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సిఐడి అధికారుల తీరుపై టిడిపి నేతలు మండిపడ్డారు.
మరోవైపు, తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చింతకాయల విజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… విజయ్ విజ్ఞప్తిని నిరాకరించింది. సీఐడీ అధికారుల విచారణకు సహకరించాలని విజయ్ ను కోర్టు ఆదేశించింది. భారతి పే పేరుతో సోషల్ మీడియాలో సీఎం జగన్ సతీమణి వైయస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై విజయ్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు.
అయితే, తనపై, తన కుమారుడిపై కక్ష సాధించేందుకే ప్రభుత్వం ఈ రకంగా సిఐడిని అడ్డుపెట్టుకుంటోందని టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ గతంలో తన ఇంటి ప్రహరీ గోడను ఉన్న పళంగా కూల్చివేశారని అయ్యన్న ఆరోపించారు. ఆ సమయంలో కోర్టు జోక్యంతో వివాదం సద్దుమణిగిందని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టిడిపి నేతలపై ప్రభుత్వం సిఐడి అధికారులును ఉసిగొల్పుతోందని అయ్యన్నపాత్రుడు, విజయ్ లు ఆరోపిస్తున్నారు.