ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత నవ్యాంధ్ర పరిస్థితి ఏమిటి? రాజధాని ఏది? హైదరాబాద్ తరహాలో నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి చెందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు సగటు ఆంధ్రుడిని తొలిచివేశాయి. అయితే, ఆనాడు నవ్యాంధ్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించారు. అందరికీ అందుబాటులో ఉండేలా నవ్యాంధ్ర నడిబొడ్డులో అమరావతిని రాజధానిగా ప్రకటించారు.
చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు స్పందించిన అమరావతి ప్రాంత రైతులు దాదాపు 30వేల ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్న క్రమంలో….జగన్ సీఎం అయ్యాడు. అక్కడితో కథ అడ్డం తిరిగింది. అమరావతి రాజధానిపై కక్ష గట్టిన జగన్…మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతేకాదు, అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అవహేళన చేశారు. అది కేవలం ఒక కులం వారు, వర్గం వారు, పార్టీవారు తమ ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తున్న పెయిడ్ ఉద్యమమంటూ అవమానించాడు.
అయితే, అమరావతి అనేది దాదాపు ఆరు కోట్లు మంది ఆంధ్రుల రాజధాని అని, రైతుల రాజధాని కాదని జగన్ గుర్తించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ విషయాన్ని జగన్ కు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గుర్తు చేశారు. అమరావతిపై దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణలో భాగంగా సీజే మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల రాజధాని మాత్రమే కాదని, నవ్యాంధ్ర ప్రజలందరి రాజధాని అని సీజే మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి నుంచి రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వాటి విచారణ సందర్భంగా సీజే మిశ్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమరావతి కోసం వేలాది మంది రైతులు వేలాది ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోని రైతులు ఇలా చేయలేదని అన్నారు.అమరావతి రైతులు తమ స్వార్థం కోసం ఉద్యమం చేయడం లేదని, ఏపీ రాజధాని కోసం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతుల ఉద్యమాన్ని సీజే మిశ్రా…స్వాతంత్ర్య ఉద్యమంతో పోల్చారు. స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారని, వారు తమకోసం కాకుండా…దేశ ప్రజలందరి కోసం పోరాడారని గుర్తు చేశారు. అంతకుముందు, పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ కీలక సమాచారాన్ని కోర్టుకు విన్నవించారు. అమరావతి రాజధానిగా ఏర్పడిన నేపథ్యం, సీఆర్డీఏ చట్టం, రైతుల త్యాగాలు, ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాలు, వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న తీరు వంటి పలు అంశాలను సీజే మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.