తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం నియమించిన శరత్ చంద్రారెడ్డి, ఉదయభాను, కేతన్ దేశాయ్ పై అభ్యంతరాలను వ్యక్తంచేస్తు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా పై ముగ్గురి వివరాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పై ముగ్గురిలో ఉదయభాను, కేతన్ దేశాయ్ విషయం ఎలాగున్నా శరత్ చంద్రారెడ్డి నేపధ్యం మాత్రం నేరపూరితమే అని అందరికీ తెలిసిందే. ఉదయభాను నూరుశాతం రాజకీయ నాయకుడు. కాబ్టటి గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో అప్పటి ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టుండచ్చు. ఇలాంటి కేసులన్నీ రాజకీయనేతలపై చాలా సహజం. పైగా ఇలాంటి కేసుల గురించి చెప్పుకోవాల్సిన అవసరంలేదు.
ఇక కేతన్ దేశాయ్ ఒకపుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా ఉన్నారు. అప్పట్లో ఆయనపై కేసులు నమోదయ్యాయని ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ కేసులను కోర్టు కొట్టేసిందని కూడా చెబుతున్నారు. కాబట్టి ఉదయభాను, దేశాయ్ నేపధ్యంపై ఎలాగూ కొద్దిరోజుల్లో క్లారిటి వచ్చేస్తుంది. ఇపుడు సమస్యంతా శరత్ చంద్రారెడ్డితోనే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ పీకల్లోతు ఇరుక్కుపోయారు. తాను నేరంచేసినట్లు స్వయంగా శరత్ అంగీకరించారు.
స్కామ్ లో తాను అప్రూవర్ గా మారిపోయారంటేనే తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లయ్యింది. అప్రూవర్ గా మారిన తర్వాతే శరత్ కు కోర్టు బెయిలిచ్చింది. లేకపోతే ఇఫ్పటికీ జైలులోనే ఉండేవారు. రేపు విచారణలో అందరితో పాటు శిక్షపడితే మళ్ళీ శరత్ జైలుకు వెళ్ళాల్సిందే.
ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్ టీటీడీ ట్రస్టుబోర్డులో మెంబర్ గా నియమించారు. శరత్ ను స్పాన్సర్ చేసిన వాళ్ళకి బుద్ధిలేకపోతే పోయుండచ్చు. కానీ నియమించిన జగన్ కు కూడా విచక్షణ లేకపోతే ఎలాగ ? రేపు శరత్ నియామకాన్ని కోర్టు కూడా తప్పుపడితే అప్పుడు జగన్ ఏమిచేస్తారు ? తన నిర్ణయమే కరెక్టని కోర్టును ఢీకొంటారా ? లేకపోతే తప్పయిపోయిందని అంగీకరిస్తారా?