ఒకప్పుడు సినీ పరిశ్రమలో పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండేది కాదు. సహాయక పాత్రలతోనే సరిపెట్టుకునేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లై, పిల్లలను కన్నాక కూడా హీరోయిన్ గా కెరీర్ ను సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరాలని డిసైడ్ అయ్యింది. 32 ఏళ్ల తమన్నా మనసు పెళ్లిపై మళ్లింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అప్పుడెప్పుడో 2005లో సినీ కెరీర్ ను ప్రారంభించిన తమన్నా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ సౌత్ లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ఆకట్టుకునే నటన, అలరించే డాన్స్, మైమరపించే అందాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా సత్తా చాటుతున్న తమన్నా.. ప్రస్తుతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సౌత్ తో పాటు నార్త్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన పెళ్లిపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లి గురించి ఆలోచించే సమయం దొరకటం లేదని.. అంతేగాని పెళ్ళికి తాను వ్యతిరేకిని కాదని తమన్నా చెప్పుకొచ్చింది.
పెళ్లి విషయంలో తనకు కొన్ని కలలు ఉన్నాయని, అందరు అమ్మాయిల్లా తనకు కూడా త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని ఉందంటూ తమన్నా మనసులో ఉన్న మాటను బయట పెట్టింది. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా పెళ్లి విషయంలో ఒత్తిడి పెరిగిపోయిందని తెలిపింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని కానీ ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుందని తమన్నా పేర్కొంది.
మొత్తానికి తమన్నా మాటల బట్టీ చూస్తుంటే త్వరలోనే ఆమె నుంచి పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ శుభ తరుణం కోసమే అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. కాగా సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల తమన్నా `బబ్లీ బౌన్సర్`, `ప్లాన్ ఏ ప్లాన్ బీ` సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
ప్రస్తుతం వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ సరసన తమన్నా నటించిన `గుర్తుందా శీతాకాలం` సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి జోడిగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న `భోళా శంకర్` సినిమాలో తమన్నా నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక వీటితో పాటు కన్నడ, హిందీ భాషల్లో సైతం తమన్నా పలు ప్రాజెక్ట్‌లను టేకప్ చేసింది.