తమిళ హీరో, ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. విజయ్ ఆంటోని కూతురు మీరా (16) ఆత్మహత్య చేసుకున్న ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. 12వ తరగతి చదువుతున్న మీరా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోనే దుపట్టాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మీరాను కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.
అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి మీరా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ ఆంటోనీ ఇంట్లో లేరని తెలుస్తోంది. కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్న మీరా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మీరా చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.