సురేష్ కొండేటి అనే ఫిలిం జర్నలిస్టు పేరు సోషల్ మీడియాలో బాగా నానుతున్న సంగతి తెలిసిందే. అతను కొన్ని డబ్బింగ్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సోషల్ మీడియా ఊపందుకున్నాక సినిమా ప్రెస్ మీట్లు, ప్రమోషనల్ ఈవెంట్లు, అలాగే ఇంటర్వ్యూలలో అతను స్పైసీ ప్రశ్నలు అడుగుతూ పాపురల్ అయ్యాడు. ఐతే ప్రశ్నలు కొంచెం స్పైసీగా ఉంటే ఓకే కానీ.. మరీ హద్దులు దాటిపోవడం, వ్యక్తిగత విషయాల గురించి చిల్లర ప్రశ్నలు అడగడంతో ఈ జర్నలిస్టు మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఎంతోమంది సురేష్ ప్రశ్నల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. కానీ ఆ ప్రశ్నలతోనే తన పేరు సోషల్ మీడియాలో బాగా నానుతుండటం, యూట్యూబ్‌లో తన వీడియోలు వైరల్ అవుతుండటంతో ఈ విమర్శలను పట్టించుకోకుండా అతను తన శైలిలోనే ప్రశ్నలు కొనసాగిస్తున్నాడు. ఐతే గతంలో హరీష్ శంకర్ ఈ జర్నలిస్టుకు గట్టి పంచ్‌లు వేయడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తమిళ హీరో సిద్దార్థ్.. సురేష్‌కు ఇచ్చిన కౌంటర్లు హాట్ టాపిక్ అయ్యాయి. సురేష్ తనకు మంచి ఫ్రెండ్ అని చెబుతూనే.. అతను ప్రశ్నలు అడిగే విషయంలో తనకు కొంచెం ఫీడ్ బ్యాక్ వచ్చిందంటూ పంచులు వేశాడు సిద్ధు.
సురేష్ పద్ధతిగా కూర్చుని.. పద్ధతిగా మట్లాడుతూ.. పద్ధతిగా ప్రశ్నలు వేస్తేనే సమాధానం ఇవ్వాలని.. లేదంటే స్పందించవద్దని తనకు సోషల్ మీడియా నుంచి కొందరు సలహా ఇచ్చినట్లు సిద్ధు వెల్లడించాడు. అంతే కాక ఓ టాపిక్ మీద మాట్లాడుతూ ప్రకాష్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడారా అని సురేష్ అడగ్గా.. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడితే మీకెందుకు, మీ ఫోన్ కాల్ గురించి కూడా నాకు అనవసరం.. నా వ్యక్తిగత విషయాల గురించి అడిగే హక్కు మీకు లేదు అంటూ అతను ప్రశ్న కొనసాగిస్తున్నప్పటికీ.. తర్వాతి వ్యక్తికి మైక్ ఇవ్వమంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు సిద్ధు. ఈ విషయంలో సిద్ధును అందరూ అభినందిస్తున్నారు.