దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. రేట్లు పెరడగంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. రేట్ల పెరుగుదలపై తాను ఒక్కదాన్నే ఏం చేయలేనన, ధరల పెరుగుదల విషయంలో చమురు సంస్థలదే బాధ్యత అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతారని.. ఆమెది మోసం చేసే వ్యక్తిత్వమని సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక వీడియోను ట్వీట్ చేశారు. పెట్రోల్ ధర పెరిగిపోవడంలో కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని 2013లో అన్న నిర్మలా సీతారామన్.. 2021లో చమురు సంస్థలదే బాధ్యత అని అంటున్నారని ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ్…నిర్మలా సీతారామన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను నమ్మిన విషయాన్ని తనకు అనువుగా మలుచుకోవడంలో మామి తరవాతే ఎవరైనా అంటూ సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
ఉల్లిపాయలు లేవు, జ్ఞాపకశక్తి లేదు, విలువలు లేవు. మామి రాక్స్ అంటూ సిద్దార్థ్ చేసిన ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. ఉల్లిపాయల ధర పెరిగినప్పుడు తాను ఉల్లిపాయలు తినను అని ఒక కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ సిద్ధార్థ్ వెటకారంగా ఈ ట్వీట్ చేశారు. అయితే, ఒక కేంద్ర మంత్రిని మామి (ఆంటీ) అని సిద్ధార్థ్ సంబోధించడం వివాదాస్పదమైంది. మామి అని సంబోధించి సిద్ధార్థ్ తన స్థాయిని తగ్గించుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
విమర్శ కూడా గౌరవంగా, మర్యాదగా ఉండాలని అంటున్నారు. గతంలోనూ బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా సిద్ధార్థ్ కామెంట్లు చేశారని, వాటితో తాము ఏకీభవిస్తామని, మామి కామెంట్ విషయంలో మాత్రం సిద్ధార్థ్ దే తప్పని కొంత మంది అంటున్నారు. యధావిధిగా సిద్ధార్థ్ పై బీజేపీ సానుభూతిపరులు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.