తమిళ కథానాయకుడు సిద్ధార్థ్, హైదరాబాద్ మూలాలున్న బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. ముందు వీళ్లిద్దరూ జస్ట్ ఫ్రెండ్సే అనుకున్నారు కానీ… తర్వాత తరచుగా కలిసి కనిపించే సరికి వ్యవహారం వేరే అని అర్థమైంది. తామిద్దరూ కలిసి పని చేసిన తొలి చిత్రం మహాసముద్రం షూటింగ్ సందర్భంగా వీరికి పరిచయం ఏర్పడింది.
ఆ సినిమా తర్వాత కూడా ఇద్దరూ కలిసి సాగడంతో వీరి రిలేషన్షిప్ గురించి అందరూ ఒక అంచనాకు వచ్చారు. వీరి ఫొటోలు ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఒక ఫొటోను స్వయంగా వైరల్ చేశాడు. ఆ ఫొటోకు అతను పెట్టిన కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
సిద్ధు, అదితి కలిసి తీసుకున్న సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అజయ్ భూపతి.. వీళ్లిద్దరూ కలవడానికి తనే కారణం అని అంటున్నారని.. కానీ అసలేం జరుగుతోందో తనకేమీ తెలియదని.. ఎవరైనా చెప్పాలని కామెంట్ చేశాడు. ఈ ఫొటో కామెంట్ ట్విట్టర్లో వైరల్ అయింది. వంశీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. మహేష్ బాబు, నమ్రతలను కలిపినట్లు.. మహాసముద్రం కూడా అలాగే డిజాస్టర్ అయినప్పటికీ సిద్ధు, అదితిలకు మాత్రం ఆ సినిమా ప్రేమకు పునాది వేసి ఒక మధుర జ్ఞాపకంగా మారిందని నెటిజన్లు కామెంట్ చేశారు.
అదితి ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఆమె కెరీర్ బాగా డల్లయిపోయింది. సిద్ధార్థ్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అతడి లేటెస్ట్ మూవీ చిత్తా తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో చిన్నా పేరుతో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా సరైన వసూళ్లు రాలేదు. త్వరలోనే సిద్ధు, అదితి పెళ్లి పీటలు ఎక్కుతారనే ప్రచారం జరుగుతోంది.