మాస్ మసాలా సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఉర్రూతలూగించే హీరో రవితేజ. అప్పుడప్పుడూ ఇమేజ్‌కు భిన్నంగా సినిమాలు చేస్తుంటాడు కానీ.. అవి ఆశించిన ఫలితాలివ్వవు. మళ్లీ తన మార్కు మాస్ సినిమాతోనే ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. గత ఏడాది ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న మాస్ రాజా.. ఇప్పుడు తన మార్కు ‘మాస్ జాతర’తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.
దీని తర్వాత రవితేజ ‘ధమాకా-2’ చేయాల్సి ఉంది కానీ.. అది వెంటనే పట్టాలెక్కేలా లేదు. దాని కంటే ముందు ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో జట్టు కట్టబోతున్నాడు రవితేజ. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’లతో యూత్ ఫుల్ కామెడీ సినిమాలకు పేరుపడ్డ కళ్యాణ్.. రవితేజతో సినిమా చేయనుండడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. వీరి కలయికలో రాబోతున్న సినిమా జానర్ మరింత ఆశ్చర్యం కలిగించేలా ఉంది.
రవితేజను సూపర్ హీరోగా చూపించబోతున్నాడట కళ్యాణ్ శంకర్. తెలుగులో సూపర్ హీరో సినిమాలు అరుదు. రవితేజను ఇలాంటి పాత్రలో చూడబోతుండడం పూర్తిగా కొత్తగా అనిపించొచ్చు. ఐతే ఇదేమీ సైన్స్ ఫిక్షన్ మూవీ కాదట. పూర్తిగా ఫిక్షనే అట. అంటే ఇందులో సోషియో ఫాంటసీ యాంగిల్ ఉండొచ్చు. రవితేజకు, కళ్యాణ్‌కు ఇద్దరికీ ఈ తరహా చిత్రం కొత్తే. మరి ఈ ప్రయోగాత్మక చిత్రంతో ఈ జోడీ ఎలా మెప్పిస్తుందో చూడాలి. కళ్యాణ్ తొలి రెండు చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన సితార సంస్థే ఈ మూవీని కూడా నిర్మించే అవకాశముంది.
మరోవైపు మ్యాడ్, డీజే టిల్లు సినిమాల్లోని పాత్రలను కలిపి ‘యూనివర్శ్’ సినిమా చేయాలని ఓ ప్రతిపాదన ఉన్నట్లు కళ్యాణ్ వెల్లడించడం విశేషం. ఈ ఐడియా నిర్మాత నాగవంశీదట. దీని మీద పని చేసి వర్కవుట్ చేయాల్సి ఉందని కళ్యాణ్ తెలిపాడు. రవితేజ సినిమా తర్వాత కళ్యాణ్.. ‘టిల్లు క్యూబ్’ సినిమాను కూడా డైరెక్ట్ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.