సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలయిక కోసం వీళ్లిద్దరి అభిమానుల నిరీక్షణ ఈనాటిది కాదు. ఆ ఇద్దరూ కూడా కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. కానీ ఈ కాంబో కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. స్వయంగా మహేష్ బాబు.. రాజమౌళితో సినిమా చేయబోతున్నట్లు ఎప్పుడో 14 ఏళ్ల కిందటే ప్రకటించిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
ట్విట్టర్ వేదికగా మహేష్ దీని గురించి ఒక పోస్ట్ పెట్టాడు. మగధీర లాంటి మెగా మూవీ తర్వాత జక్కన్న.. మహేష్‌తో జత కట్టాల్సింది. కానీ ఎందుకో అప్పుడా సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా తిరుగులేని స్థాయిని అందుకున్న సమయంలో మహేష్ ఆయనతో సినిమా చేస్తున్నాడు. గురువారమే ఈ సినిమాకు ప్రారంభోత్సవం జరిగింది.
ఈ సందర్బంగా 2014 మే 22న పెట్టిన మహేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని వేలమంది అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు. 14 ఏళ్ల కల ఇప్పటికి నెరవేరింది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ట్వీట్లో ఎట్లకేలకు తమ సినిమా కార్యరూపం దాలుస్తోందని మహేష్ వ్యాఖ్యానించగా.. ఇంకో 14 ఏళ్లకు కానీ ఈ కలయికలో సినిమా కార్యరూపం దాల్చలేదంటే ఎంత ఆలస్యం అయిందో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఆలస్యం అయితే అయింది.. ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించిన టైంలో, వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్లో అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్లతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతుండడం మహేష్ అదృష్టమే అని.. లేటుగా అయినా వీరి నుంచి రికార్డ్ బ్రేకింగ్ వస్తే అంతకంటే సంతోషం ఏముందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.