దర్శకుడు బాబీ, మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ ల కాంబోలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించాలని భావించగా…తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దయింది. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లో ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిరాడంబరంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల తొక్కిసలాట ఘటనపై బాలకృష్ణ స్పందించారు. ఆ ఘటన చాలా బాధాకరమని, అది తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆ ఘటన నేపథ్యంలోనే అనంతపురంలో నిర్వహించవలసిన ఈవెంట్ రద్దు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు చిత్ర బృందం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆ తర్వాత బాలయ్య బాబు తన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ స్టార్..ఆ స్టార్..ఆ నంబర్ నేను పట్టించుకోను..ఎందుకు బాలయ్యకు అంత పొగరు అని అడుగుతుంటారు..నా ఆలోచనలే వేరు..నా రూటే వేరు…నా మాట సూటిగా ఉంటుంది… నా బాట ముక్కు సూటిగా ఉంటుంది…నేనే నా పొగరు..నేనే నా ధైర్యం…ఒకరి కీర్తి నేను మొయ్యను..నన్ను నేను మలుచుకున్న మహారాజ్ ను నేను…అందుకే ఈ చిత్రం పేరు డాకు మహారాజ్..’’ అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
‘‘అఖండ-2 షూటింగ్ మొదలుబెట్టాం…నా రెండో ఇన్నింగ్స్ లో నేనేంటో చూపిస్తా…అందరూ సెకండ్ ఇన్నింగ్స్ అంటే స్టార్ డమ్ పోయిన తర్వాత మొదలుబెడుతుంటారు..నేను అలా కాదు…ఏం చూసి ఇంత అహంకారం అని కొందరు అనుకోవచ్చు…నన్ను చూసి నాకే పదునైన పొగరు..నాన్నగారు నాకు ఇన్ స్పిరేషన్..ప్రేక్షకులే నా బలం..’’ అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.