కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. హెచ్ సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎంతమందిపై కేసులు పెట్టకుంటూ వెళ్తారని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని నిలదీశారు.
అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు..అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని హెచ్చరించారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హరీశ్ రావు చెప్పారు.
ఇక, రేవంత్ ప్రభుత్వం రైతులపై పగతో పని చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలపై ప్రేమను చూపించకుండా ద్వేషం నింపుకున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాల్వల భూ సేకరణకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.
అన్ని ప్రాజెక్టులలో నీళ్లున్నాయని, కానీ, కావాలనే రైతులకు నీళ్లు వదలడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు సొంత డబ్బుతో కాల్వలు తవ్వుకుని తమ పంటలు పండిస్తున్నారని అన్నారు. కాల్వల భూసేకరణకు రూ.20 కోట్లు విడుదల చేయాలని, అప్పుడే మరింత భూమి సాగులోకి వస్తుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ సర్కార్ అవహేళన చేస్తోందని అన్నారు. ఉత్తర తెలంగాణ కు ఆ ప్రాజెక్ట్ ఒక వరమని అన్నారు. కాళేశ్వరం వల్లే తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.