ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇన్ చార్జి డీజీపీగా ఆయన కొనసాగుతున్నారు. నేటి నుంచి పూర్తి స్థాయి డీజీపీగా ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించింది.
2024 ఎన్నికలకు ముందు తాత్కాలిక డిజీపీగా ఎన్నికల సంఘం ఆయనను ఏపీ డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది జనవరి 31తో ముగియడంతో హరీష్ కుమార్ గుప్తా ఇన్ చార్జి డీజీపీగా ఫిబ్రవరి 1 నుంచి కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నేటి నుంచి పూర్తి స్థాయి డీజీపీగా ఆయనను ప్రభుత్వం నియమించింది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నేడు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
1992 బ్యాచ్ IPS అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా నేటి నుంచి రెండేళ్లపాటు ఏపీ డీజీపీగా ఆయన కొనసాగనున్నారు. ఎన్నికల సమయంలో, గత నాలుగు నెలలుగా పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు హరీష్ కుమార్ గుప్తా. హరీష్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోనే హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.