తెలీనోడు తెలీనట్లుగా అన్ని మూసుకొని కూర్చుంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా విశ్లేషకుడి మాదిరి మాట్లాడటం.. నోరు పారేసుకోవటం.. తెలీదంటూనే ఇష్టం వచ్చినట్లుగా అనేయటం లాంటివి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు చేయకూడని పనుల్లో ముఖ్యమైనది. కానీ.. అలాంటివేమీ పట్టని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తాజాగా ట్వీట్ తో నోరు పారేసుకున్న వైనం సంచలనంగా మారింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఓటమి కష్టాల్లో ఉన్న జట్టును ఓడిపోనివ్వకుండా చేసి.. డ్రాగా ముగించిన అతగాడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రీజ్ లో ఉండి 259 బంతుల్ని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. కొండంత సహనాన్ని.. ఓపిగ్గా వ్యవహరిస్తూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన అతడి బ్యాటింగ్ తీరును ప్రతిఒక్కరు ప్రశించటం తెలిసిందే. అలాంటి క్రికెటర్ ను పట్టుకొని నోటికొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో.
నిజానికి ఓపిగ్గా విహారి ఆడిన ఇన్నింగ్స్ పుణ్యమా అని.. అతడి పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలోకి వెళ్లిన వైనాన్ని అందరు మెచ్చుకున్నారు. ఇలాంటివేళలో.. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బాబుల్.. అవేమీ పట్టించుకోలేదు. తనకు తెలిసి తెలియని అవగాహనతో నోరు పారేసుకున్నారు. ‘ఏడు పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమిండియా చారిత్రక విజయాన్ని హనుమ బిహారి చంపేయటమే కాదు.. క్రికెట్ ను హత్య చేశాడు’ అంటూ తీవ్ర వ్యాఖ్య చేయటంతో పాటు.. అతడి పేరును విహారి బదులుగా బిహారిగా పేర్కొన్నారు.
తన ట్వీట్ చివర్లో తనకు క్రికెట్ గురించే మీద తెలీదని పేర్కొన్నారు. విహారిని అవమానించేలా అతడి పేరును బిహారీగా పేర్కొనటంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటివేళ.. కేంద్రమంత్రి చేసిన ట్వీట్ కు చాలా సింఫుల్ గా సూటిగా చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు విహారి. కేంద్రమంత్రి ట్వీట్ కు తన స్పందనగా పేర్కొంటూ.. ‘హనుమ విహారి’గా పేర్కొన్నారు. హుందాగా.. అతడిచ్చిన సమాధానాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఆటగాళ్లకు అవసరమైన స్థైర్యాన్ని అందివ్వాలి. అది చేతకాకపోతే.. మాట్లాడకుండా మౌనంగా ఉంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లు మాట్లాడి.. ఆటగాళ్ల నైతిక స్థైర్యానికి దెబ్బ తీయకూడదన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు?