అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముల వారి ఆలయానికి విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అన్నిరంగాల వారు అడగకనే విరాళాలు ఇచ్చేస్తున్నారు. దానిని ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఎపుడూ ఇలాంటి వాటికి మీడియా ముందుకు రాని పారిశ్రామిక వేత్తలు జీవీకే వంటి వారు కూడా బహిరంగంగా విరాళాలు ఇస్తున్నారు.
తాజాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జీవికే అధినేత జీవి కృష్ణారెడ్డి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారకర్త దేవేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలకు ఆ చెక్కును అందించారు కృష్ణారెడ్డి.
అయోధ్యలో రామ్ ఆలయం నిర్మాణం కోసం 2021 నవంబర్ 9 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. ఆలయాన్ని ప్రజల విరాళాలతో నిర్మించాలని రామమందిర్ ట్రస్ట్ నిర్ణయించింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం విరాళాల సేకరణ ప్రారంభం కాగా… తొలిరోజే శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రానికి సుమారు ₹ 100 కోట్లు విరాళం లభించినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాయ్ ఆదివారం వెల్లడించారు.
అయోధ్యలో గొప్ప ఆలయ నిర్మాణం కోసం శ్రీ రామ్ జన్భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రారంభించిన ఈ సామూహిక విరాళాల సేకరణ కార్యక్రమం… జనవరి 15 న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది.