తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అధికార పార్టీలో చేరేందుకు తమకు తోచిన దారులు వెతుక్కుంటున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిసి 65 మంది సభ్యుల బలం ఉంది. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు వైపే ఉండే ఎంఐఎం పార్టీని కలుపుకుంటే 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 72 మంది సభ్యుల బలం ఉన్నట్లు లెక్క. కానీ శాసనమండలిలో మాత్రం బీఆర్ఎస్ సభ్యుల బలమే ఎక్కువగా ఉంది. దాని చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తున్నది. గతంలో టీడీపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుత్తా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు మండలి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా ఆయన చేతిలోనే ఉంటుంది. అయితే గత కొన్నాళ్లుగా ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నాడు.
తన కుమారుడికి నల్లగొండ ఎంపీ ఆశించిన గుత్తా పార్టీ నిర్ణయం వెలువడక ముందే పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం కావడానికి.. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి ఆయా జిల్లాలకు చెందిన గత మంత్రులే కారణమని చెప్పారు. వారి అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని, పరిస్థితి ఇలా ఉన్నా ఇప్పటికీ సమీక్షించుకోకపోవడం దురదృష్టకరమని, శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే పార్టీ నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశారని ఆరోపించారు.
ఒకప్పుడు జేబులో రూ. 500 కూడా లేని నేతలు ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతులయ్యారని, ఉద్యమకారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని, జిల్లాకు చెందిన నేతలు కొందరు తాను కేసీఆర్ను కలవకుండా అడ్డుకుంటున్నారని గుత్తా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కొందరు పార్టీ మారిన నేపథ్యంలో వారి మీద చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేయడంలో భాగంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం ఉంటే నేరుగా ఆ విషయం చెప్పకుండా ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.