గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ఓ మై బేబీకి సంబంధించి వివాదం ముదురుతోంది. ఈ పాట లిరిక్స్, ట్యూన్ ఏ మాత్రం బాగోలేదు అంటూ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి ట్రోలింగ్ ఒక దశలో శృతి మించి.. సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రిలను తీవ్రస్థాయిలో దూషించారు. ఈ క్రమంలోనే రామ జోగయ్య శాస్త్రికి ఒళ్ళు మండి ట్రోలర్లను డాగ్స్ అని సంబోధిస్తూ విరుచుకుపడ్డారు.
దీని మీద నిన్నంతా పెద్ద గొడవే జరిగింది. చివరికి రామ జోగయ్య కొంచెం తగ్గి.. అభిమానులకు రాజీ ప్రతిపాదన చేస్తున్నట్లుగా ఒక పోస్ట్ పెట్టి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని గంటల్లోనే నిర్మాత నాగ వంశీ లైన్ లోకి వచ్చాడు. ఆయన అనిమల్ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ లో వచ్చే ఒక వల్గర్ షాట్ ఉపయోగించి ట్రోలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారం అంతా చూస్తుంటే గుంటూరు కారం టీ కొరివితో తలగోక్కుంటున్నట్లే అనిపిస్తోంది. స్టార్ హీరోల అభిమానులు అన్నాక అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి.
ప్రతిదీ ది బెస్ట్ గా ఉండాలని వారు కోరుకుంటారు. అంచనాలకు తగ్గట్టు ప్రమోషనల్ కంటెంట్ లేనప్పుడు వారి నుంచి అసంతృప్తి వ్యక్తం కావడం సహజమే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అనివార్యం. దాన్ని టీం సభ్యులు ఎదుర్కోక తప్పదు. కంటెంట్ బాగుంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి సినిమాకు హైప్ తీసుకొచ్చేది అభిమానులే. రేప్పొద్దున సినిమాకు ముందుండి టికెట్లు తెంచాల్సింది కూడా వాళ్లే. అలాంటప్పుడు వారికి నచ్చని కంటెంట్ పట్ల వ్యతిరేకత వస్తే తప్పులు దిద్దుకోవాలి, వారి అంచనాలకు తగ్గ అవుట్ పుట్ ఇవ్వడానికి చూడాలి కానీ.. కొందరు అభిమానులు అభ్యంతరకర భాష వాడారని మొత్తంగా అందరినీ ఒకే గాటన కట్టి, వారిని ట్రిగ్గర్ చేసేలా సగటు సోషల్ మీడియా అభిమానుల స్థాయిలో పోస్టులు పెట్టడం సరైనదేనా అన్నది ప్రశ్న. దీనివల్ల అభిమానుల్లోనే నెగిటివిటీ పెరిగిపోయి అంతిమంగా సినిమాకు నష్టం జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి.