ఈ మధ్య కాలంలో ఓ పెద్ద సినిమా గురించి అత్యధిక సంఖ్యలో నెగెటివ్ న్యూస్‌లు, రూమర్లు హల్చల్ చేసిందంటే ‘గుంటూరు కారం’ విషయంలోనే. రెండేళ్ల కిందట ఏ ముహూర్తాన త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమాను అనౌన్స్ చేశారో కానీ.. ఈ ప్రాజెక్టుకు ప్రతి దశలోనూ ఏదో ఒక అడ్డంకి తప్పలేదు. అన్నింటినీ అధిగమించి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాక కూడా సమస్యలు తప్పట్లేదు.
ఈ చిత్రం నుంచి లీడ్ హీరోయిన్ను తప్పించి రెండో హీరోయిన్ అయిన శ్రీలీలను మెయిన్ లీడ్‌గా చేయడం, రెండో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకోవడం తెలిసిందే. మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌ను తప్పించినట్లు జోరుగా ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తేలింది. గతంలో ఈ సినిమా నుంచి ఫైట్ మాస్టర్లను తప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడీ సినిమా నుంచి కీలకమైన టెక్నీషియన్ తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘గుంటూరు కారం’కి ముందు నుంచి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నది రవి.కె.చంద్రన్. ఆయన ఇప్పుడీ సినిమాకు దూరమైనట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలోకి పి.ఎస్.వినోద్ వచ్చారట. మహేష్-త్రివిక్రమ్ కలయికలో ముందు మొదలైన సినిమాను కొంత షూట్ తర్వాత ఆపేయడం.. ఆ తర్వాత కథంతా మార్చి వేరే సినిమాను మొదలుపెట్టడం తెలిసిన విషయమే. రెండోసారి మొదలైన సినిమాలోనూ కొన్ని సీన్లు తీసి పక్కన పడేశారు. స్క్రిప్టులో, కాస్టింగ్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు అప్పుడప్పుడూ ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు.
అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ కాల్ షీట్లు ఇవ్వాల్సి వచ్చింది రవి.కె.చంద్రన్. కాల్ షీట్లు పెరిగితే పారితోషకం కూడా పెరుగుతుంది కానీ.. దీని వల్ల వేరే కమిట్మెంట్లకు ఇబ్బంది అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన విసుగెత్తిపోయి సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పి.ఎస్.వినోద్ ఇంతకుముందు అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలకు త్రివిక్రమ్‌తో కలిసి పని చేశాడు.