గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలకు సిట్టింగ్ ఫిట్టింగ్ టెన్షన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.
తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందంటే చాలు వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలవుతుంది.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుండెల్లోనూ జగన్ కొద్ది రోజుల క్రితం గుబులు రేపారు.
జయరాం సిట్టింగ్ స్థానం ఆలూరు నుంచి ఆయనను తప్పించి కర్నూలు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నియమించారు.
ఈ క్రమంలోనే తన సిట్టింగ్ స్థానం పోయిందన్న గుబులుతో గుమ్మనూరు గుమ్మనంగా ఉంటున్నారు.
తాజాగా గుమ్మనూరు జయరాం వైసీపీ హై కమాండ్ తో పాటు తన అనుచరులకూ అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది.
తన సిట్టింగ్ స్థానం కోల్పోయిన వెంటనే బెంగుళూరులో నాలుగు రోజులు గడిపిన జయరాం..ఆ తర్వాత ఆలూరుకు వచ్చి తన అనుచరులు, సన్నిహితులతో మూడు రోజు చర్చలు జరిపారు.
అయితే, జయరాం ఈసారి కూడా ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అనుచరులు అభిప్రాయాలు వ్యక్తం చేశారట.
ఈ క్రమంలోనే ఎవరికీ టచ్ లో లేకుండా జయరాం స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయారట. ఆలూరు వైసీపీ ఇన్చార్జిగా జగన్ నియమించిన విరూపాక్షిని కూడా జయరాం కలవలేదట.
దీంతో, జయరాం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలకు సమయం ఉందని, ఈలోపు ఏదైనా జరుగుతుందని గతంలోనే జయరాం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
విషయం ఏదైనా..తమతో చెప్పాలి కదా అన్న భావనలో వైసీపీ పెద్దలు జయరాంపై గుర్రుగా ఉన్నారట.