అమరావతిపై వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ నేతలంతా అక్కసు పెంచుకున్న సంగతి తెలిసిందే. కేవలం, టీడీపీ నేతలను, ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు. అందుకే, అమరావతిని అవమానించేలా తన నేతలతో అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయించారు. అమరావతిని శ్మశానంలా ఉంచారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని బొత్సను విలేకరులు ప్రశ్నించగా…ఆ వ్యాఖ్యలకు తాను కట్టబడి ఉన్నానని బొత్స చెప్పడం సంచలనం రేపింది. ఇక, తాజాగా అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన వైసీపీ నేతలు మరోసారి తమ నోటికి పనిచెప్పారు. గతంలో మాదిరిగానే అమరావతిపై విషం చిమ్మేందుకు వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు.
తాజాగా అమరావతిపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని, అది దెయ్యాల రాజధాని అని వివాదాస్పద కామెంట్లు చేయడం రాజకీయ కాక రేపింది. అంతేకాదు, ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, దానికి సంబంధించి కొత్త బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని కూడా అన్నారు.
పాత బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందుకే సవరణలు చేసి కొత్త బిల్లును తీసుకువస్తున్నామని చెప్పారు. చంద్రబాబుపై కూడా అమర్నాథ్ వివాదాస్పద విమర్శలు చేశారు. గాడిదకు కొమ్ములు వచ్చినా, ముసలోడికి పిచ్చి వచ్చినా భరించడం కష్టమని అమర్నాథ్ సామెత చెప్పారు. అంతేకాదు, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సామెత గుర్తుకు వస్తోందని వివాదాస్పద కామెంట్లు చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న చంద్రబాబు మాటలు వింటే కులీ కుతుబ్‌షా ఉరేసుకుంటారంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.