సీఎం జగన్ ఏదైనా బహిరంగ సభలో ప్రసంగించడం మొదలుబెట్టారంటే ముందుగా దుష్ట చతుష్టయం అంటూ ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టీవీ 5, టిడిపిలపై విమర్శలు గుప్పిస్తుంటారు. తనపై విష ప్రచారానికి ఆ మీడియా సంస్థలు కంకణం కట్టుకున్నాయని వాపోతుంటారు. ఆ రకంగా ప్రజల దగ్గర సానుభూతి కొట్టేసేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో అయితే ఏకంగా తన ప్రెస్ మీట్ కవర్ చేయడానికి వచ్చిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ విలేకరులను కూడా రావద్దని సూటిగా చెప్పిన వ్యక్తి జగన్. ఈ క్రమంలోనే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా జగన్ దారిలోనే వైసీపీ నేతలూ నడుస్తున్నారు.
తమ పార్టీ అధినేత ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా అదే తరహాలో అదే బాటలో నడవడం అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అందుకే, తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 లపై మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్లు జనానికి వింతగా అనిపించలేదు. చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా ఆ రెండు ఛానళ్ల ప్రతినిధులు, విలేకరులు మినహా మిగిలిన వాళ్ళు తనను ప్రశ్నలు అడగచ్చంటూ గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
ప్రభుత్వంలోని లోపాలను, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న మీడియా ఛానళ్లకు సమాధానం చెప్పలేక ఈ రకంగా ప్రశ్నలు అడగద్దు అని చెప్పడం ఏమిటని అమర్నాథ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇటువంటి విష సంస్కృతికి వైసీపీ అధినేత జగన్ బీజం వేస్తే అది ఇప్పుడు ఒక మహా వృక్షంగా మారి అమర్నాథ్ వంటి నేతలు కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. చేతనైతే ఏ ఛానల్ కు చెందిన మీడియా ప్రతినిధులు అయినా సరే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం దీటుగా చెప్పగలగాలని, ప్రజాప్రతినిధిగా జగన్, అమర్నాథ్, ఏ పార్టీకి చెందిన నేతకైనా ఆ బాధ్యత ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఇక, ఈ మీడియా సమావేశం సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లపై అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ నోటీసులలో లోకేష్ పేరు కూడా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఐటి శాఖ 46 పేజీలతో షోకాజ్ నోటీసులు జారీ చేస్తే వాటిని చంద్రబాబు ఎందుకు నిరాకరిస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక, ఈ వ్యవహారంపై ఈడీ విచారణ జరపాలంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు.