బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు రెండు వారాల క్రితం లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడుతూ.. లేఖ రాసింది వాస్తవామే.. కానీ అంతర్గతంగా రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందో తేలాలన్నారు. పార్టీలోనే ఎవరో కుట్ర చేసి తన లేఖను లీక్ చేశారని ఆమె మండిపడ్డారు. మా నాయకుడు కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన పక్కన కొన్ని దెయ్యాలు ఉన్నాయి, అవే ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నాయని కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు. కోవర్టులను పక్కకు తప్పిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని కవిత హితవు పలికారు.
అయితే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. `కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు కవిత గారు..? కేసీఆర్ పక్కనున్న కోవర్టులెవరు..? అంటూ ప్రశ్నించారు. సొంత తండ్రితో కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాశారు..? ఫామ్‌హౌస్‌లోకి మీకు ప్రవేశం లేదా..? బీఆర్ఎస్‌లో మీపై కుట్ర చేస్తుందెవరు..? మీ లేఖ లీక్ చేసిందెవరు..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు..? ఇంత జరుగుతున్నా మీ ఫ్యామిలీ మీకెందుకు అండగా నిలబడటం లేదు..? మీ లేఖ నకిలీదని మీ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రాయించిందెవరు..? అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన మీకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకడానికి బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు రాలేదు..?` అంటూ ఆది శ్రీనివాస్ కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మరోవైపు సోషల్ మీడియా, ప్రధాన మీడియాలోనూ కవిత వ్యాఖ్యలపై జోరుగా చర్చలు జరుగుతున్నారు. కవిత చెప్పిన దెయ్యాలు ఎవరు..? ఆమె వ్యాఖ్యలు కుటుంబసభ్యుల గురించినా? లేకా బయట వ్యక్తుల గురించా? అంటూ రాజకీయ విశ్లేషకులు జుట్టు పీక్కుకుంటున్నారు.