బండి సంజయ్ తూటాలు అవసరం లేకుండా కేవలం మాటలతోనే కేసీఆర్ కు గాయాలు చేస్తున్నారు. కేసీఆర్ ను వెంటాడుతు ఆయనకు నిద్రపట్టనివ్వడం లేదు. తాజాగా కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లకు ఓకే చెప్పడం తెలిసిందే. సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం లాగే ఇది కూడా ఒక జోక్ అని బండి సంజయ్ కొట్టి పారేశారు.
ఇన్నిరోజులు ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ కు దుబ్బాక, జీహెచ్ఎంసీ దెబ్బతో సోయి వచ్చినట్టుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే బీజేపీ ఈ అంశంపై ఆందోళనకు దిగుతుందని పసిగట్టి నోటిఫికేషన్ అని పేపర్ ప్రకటన ఇచ్చారని ఆరోపించారు.
నిజంగా నిరుద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు శాఖల్లో మాత్రమే ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నోటిఫికేషన్ ఒక బూటకం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇదో కొత్త నాటకం, దుబ్బాక, జీహెచ్ఎంసీ దెబ్బలో దొరకి ఆరేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారు… అంటూ బండి సంజయ్ ఆరోపించారు.
మైకు దొరికితే అబద్ధాలు… అలాంటివి వినివిని ప్రజలు విసిగిపోయారు. కేసీఆర్ ను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు, తాజా ప్రకటన ఒక జోక్ అనుకుంటున్నారు. అంతేకాదు, నోటిఫికేషన్ తప్పుల తడకలుగా ఇచ్చి కోర్టుల ద్వారా నోటిఫికేషన్ రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఈసారి అదేకనుక జరిగితే నిరుద్యోగుల తడాఖా చూపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.