తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ సీఎం కేసీఆర్ వెర్బల్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆ వ్యవహారం సద్దుమనగకముందే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో గులాబీ బాస్ కేసీఆర్ కు కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పై తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కొద్దిసేపు వాదనలు జరిగిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు ప్రభుత్వం తరఫు లాయర్ తెలిపారు. అంతేకాదు, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు వెల్లడించారు. అంతకుముందు, లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అయితే, లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. కానీ, వాదనలు ప్రారంభమైన కొద్దిసేపటికే తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు వెల్లడించారు. దీంతో, గవర్నర్ విషయంలో తొలిసారి కేసీఆర్ వెనక్కు తగ్గినట్లయింది.
కాగా, ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తమిళిసై…కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 5 లక్షల మందితో కేసీఆర్ ఖమ్మంలో బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం కాదని, జాతి నిర్మాణం అని కొత్త సచివాలయాన్ని ఉద్దేశించి తమిళిపై విమర్శించారు. ఫామ్‌హౌస్‌లు కట్టడం కాదని, అందరికి ఫార్మ్‌లు కావాలని, రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదని, రాష్ట్రంలోని విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని తమిళిసై అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని సూచించారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని.. కానీ తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని తమిళిసై చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని అన్నారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని గవర్నర్ అన్నారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని తమిళిసై ఆరోపించారు.