ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలక పాన్పు దిగి మౌనం వీడారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత గోరంట్ల రాజీనామాపై తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. చచ్చేవరకు టీడీపీతోనే ఉంటానని, చంద్రబాబే తన బాస్ అని గోరంట్ల వెల్లడించారు. పార్టీలో అంతర్గతంగా లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటామని, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని గోరంట్ల పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని తెలిపారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన గోరంట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిణామాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు పార్టీని కూడా విస్మరించి కష్టపడ్డారని, కానీ ఫలితం వేరేలా రావడం వల్ల ఇపుడు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు..
ఏపీలో అభివృద్ధి శూన్యం అని, అరాచక, ఆటవిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా నిద్రపోనని గోరంట్ల శపథం చేశారు. లక్షలాది మంది కార్యకర్తల అభిష్టం ప్రకారం తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానని గోరంట్ల వెల్లడించారు. చచ్చేదాకా టీడీపీలో ఉంటానని, ఇంకో జెండాపట్టనని అన్నారు. లక్షలాది మంది టీడీపీ కార్యకర్తల త్యాగాలు వృథా కాకూడదని అన్నారు.
పార్టీలో అంతర్గతంగా లోటుపాట్లున్నాయని, వాటి గురించి తన బోటి సీనియర్ నేతలు చెప్పకుంటే వేరెవరు చెబుతారని అన్నారు. పార్టీ అధిష్టానం కూడా వాటిపై ఫోకస్ చేసి లోపాలను సరిదిద్దుకోవాలని అన్నారు. పార్టీ నాది అన్న భావన అందరిలో రావాలని, గ్రౌండ్ లెవల్లోకి నేతలు వెళ్లాలని అన్నారు. సెల్పీలు దిగి…కార్యక్రమాలు చేశామని మమ అనిపించకూడదని హితవు పలికారు. బ్లాక్ మెయిల్ చేయాలని, బెదిరించాలని ఇలా చేయలేదని, లోపాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లాలనే ఆవేదనతో ఇలా చేశానని వివరణనిచ్చారు.