ఏపీ రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి పరిచయం అక్కర లేదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట ఉన్న గోరంట్ల…ఇప్పటివరకు టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తగా అన్ని సమయాల్లోనూ పార్టీ వెన్నంటి నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకొని మరీ రాజమండ్రి రూరల్ లో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించారు. అటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి…తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే గోరంట్ల టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. మరో రెండు మూడ్రోజుల్లో తన శాసన సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 25న గోరంట్ల తన రాజీనామాపై ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ తీరుపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని, తన ఫోన్ను కూడా నారా చంద్రబాబు, నారా లోకేష్ అటెండ్ చేయకపోవడంతో గోరంట్ల తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
మరోవైపు, గోరంట్ల రాజీనామా పుకార్ల నేపథ్యంలో ఆయనను సంప్రదించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా…ఆయన స్పందించలేదు. ఆయన నివాసం వద్ద ఈ రోజు మీడియా ప్రతినిధులు వెళ్లగా…ఈ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడనని గోరంట్ల చెప్పినట్లు తెలుస్తోంది. అనుబంధ కమిటీలు, స్థానిక నాయకత్వంపై గత కొద్దిరోజులుగా బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారని, దీంతో, రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు, గత రెండు నెలలుగా టీడీపీ తరఫున జరుగుతున్న కార్యక్రమాల్లో గోరంట్ల చురుగ్గా పాల్గొనకపోవడం వంటి విషయాలు గోరంట్ల రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
అయితే, తన రాజీనామాపై ఇప్పటిదాకా గోరంట్ల బుచ్యయ్య అధికారికంగా స్పందించలేదు. పార్టీపై, పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బుచ్చయ్య చౌదరి…పార్టీ పెద్దలు బుజ్జగిస్తే వెనక్కి తగ్గుతారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ రాజీనామా చేస్తే వైసీపీలో చేరతారా లేక బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అన్న చర్చ మొదలైంది. సీఎం జగన్, వైసీపీలపై మొదట్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన …గత రెండు మూడు నెలలుగా అధికార పార్టీపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీంతో, బుచ్చయ్య వైసీపీలో చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.