ప్రపంచంలో లక్షలాది కంపెనీలు ఉన్నా.. కొన్నికంపెనీల్లో పని చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా తహతహలాడే సంస్థల్లో టాప్ ఫైవ్ లో ఉంటుంది టెక్ దిగ్గజం గూగుల్. ఎందుకంటే.. ఆ సంస్థలో ఉద్యోగం వస్తే.. జీవితంలో అంతకు మించిన పెద్ద అచీవ్ మెంట్ మరొకటి లేదన్నట్లుగా పలువురు అభివర్ణిస్తుంటారు. అలాంటి గూగుల్.. ఇటీవల మాంద్యం పరిస్థితుల్లో తన తీరును పూర్తిగా మార్చేసుకోవటం తెలిసిందే. ఖర్చులు తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొన్ని కఠిన నిర్ణయాల్ని గూగుల్ ప్రకటించింది.
ఈ మధ్యన ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తీసేయటం తెలిసిందే. ఖర్చుల్ని తగ్గించుకోవటం కోసం సంస్థ చేపట్టిన చర్యలపై ఉద్యోగులు గుర్రుగా ఉంటున్నారు. ఇది సరిపోనట్లు తాజాగా చేపట్టిన మరిన్ని చర్యలపై మరింత ఆగ్రహం వ్యక్తం అయ్యేలా తాజా చర్యలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఉద్యోగులకు ఉచితంగా అందించే భోజనం.. లాండ్రీ సర్వీసులు.. స్నాక్స్ తో పాటు మసాజ్ సదుపాయాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ఇంతకాలం ఉద్యోగులకు ఇంటి అల్లుళ్ల మాదిరి చూసుకున్న గూగుల్.. ఇప్పుడు అందుకు భిన్నంగా తన నిర్ణయాలతో.. మీరు పనోళ్లు.. అన్న రీతిలో వ్యవహరిస్తోందన్న వాదనను ఉద్యోగుల నోటి నుంచి వినిపిస్తున్న పరిస్థితి.
ఇంతకాలం ఉద్యోగులకు అందించిన వసతులు.. సౌకర్యాల్లో కొన్నింటిని తొలగించటం.. లేదంటే తగ్గించటం లాంటి చర్యల్ని చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులకు లేఖ ద్వారా వివరాలు అందించారు గూగుల్ ప్రధాన ఆర్థిక అధికారి రూత్ పోరట్. దీనిపై గూగుల్ ఉద్యోగుల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.