ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం దగ్గర నుంచి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న చంద్రబాబు..మరోవైపు పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిధులకు సంబంధించి తీపి కబురు అందింది. ఆ నిధులను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా అందించేలా సర్దుబాటు చేసింది. ఆ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిధులు స్వీకరించేందుకు సీఆర్డీయే కమిషనర్ కు అధికారాలు కల్పిస్తన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రోడ్లు, జలవనరులతోపాటు అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులు ఈ నిధులతో చేపట్టాలంటూ సీఆర్డీయేకి దిశానిర్దేశం చేసింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, పర్యావరణ హిత నిర్మాణాలు, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. అమరావతి అభివృద్ధికి సీఆర్డీయే పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమరావతి నిర్మాణానికి మరో రూ.6,750 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది.