ఓవైపు ప్రపంచంలోని పలు దేశాలు మహిళల హక్కులు.. వారి స్వేచ్ఛతో పాటు.. వారిని వేధింపులకు గురి చేసే అంశాల విషయంలో మరింత కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. అందుకు భిన్నంగా ఒక దేశంలో మాత్రం దుర్మార్గమైన చట్టం చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆ దేశం మరేదో కాదు ఇరాక్. ప్రస్తుతం ఆ దేశంలో అధికార పక్షం తీసుకొచ్చిన ఒక బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల పెళ్లి వయసును తొమ్మిదేళ్లకు కుదించాలంటూ సదరు బిల్లులో ప్రతిపాదించటమే దీనికి కారణం.
పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఆ దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. కానీ.. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లులో మాత్రం దాన్ని సగానికి కుదించి.. తొమ్మిదేళ్లకు పరిమితం చేశారు. ఒకవేళ.. ఈ చట్టం పాస్ అయితే అమ్మాయికి తొమ్మిదేళ్లు.. అబ్బాయికి పదిహేనేళ్లు వచ్చేస్తే వారి పెళ్లిళ్లకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకి ఉండదు.
ఈ బిల్లు పాస్ అయితే.. లింగ సమానత్వం.. మహిళల హక్కుల విషయంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని దెబ్బ తీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలు.. మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే.. చిన్న వయసులోనే చిన్నారులు గర్భం దాల్చటం.. హింస మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
యూనిసెఫ్ నివేదిక ప్రకారం ఇప్పటికే ఇరాక్ లో 18 ఏళ్ల లోపు అమ్మాయిల్లో దాదాపు 28 శాతం మందికి పెళ్లిళ్లు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇరాక్ పార్లమెంట్ లోనూ అమ్మాయిల వివాహ వయసును తగ్గించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇరాక్ లో ఈ దుర్మార్గమైన పరిస్థితి నెలకొంది. ఈ దారుణాన్ని దేవుడైనా రంగంలోకి దిగి ఏదో ఒకటి చేయాలన్న మాట వినిపిస్తోంది.