తెలంగాణ ఉద్యమ సారథి.. సీఎం కేసీఆర్.. గతానికి భిన్నంగా గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి పెట్టారని అంటు న్నారు పరిశీలకులు. గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల సమయంలోను, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విషయంలోనూ కేసీఆర్ అనుసరించిన వైఖరిని గమనిస్తే.. చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అనూహ్య నిర్ణయా లు.. అర్ధరాత్రి ఆదేశాలు.. వంటివి సంచలనం రేపుతున్నాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే… దుబ్బాక ఎన్నికల ఎఫెక్టేనని అంటున్నారు పరిశీలకులు. ఐదురోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఓ అర్ధరాత్రి జీవోను విడుదల చేసింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నీట మునిగింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. వందలాది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు కూలిపోయాయి. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చేశారు. అందిన వారికి అందింది.. అందనివారి అందలేదు. కానీ, అనూహ్యంగా ఆయన రెవెన్యూ శాఖ పేరిట ఓ జీవోను జారీ చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే.. పరిహారం ఇస్తాం.. దరఖాస్తు చేసుకోండి అని జీవోలో పేర్కొన్నారు. ఆ వెంటనే తెల్లారి..మంత్రి కేటీఆర్.. దీనిని ఓ సభలో స్వయంగా వెల్లడించారు. వెనువెంటనేరంగంలోకి దిగిన అధికారులు ఇతర పనులు మానేసి పరిహారం పంచే పనిలో పడిపోయారు.
వాస్తవానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యకలాపాలు సాయంత్రం ఐదు గంటలకే ముగియాల్సి ఉన్నా.. రాత్రి తొమ్మిది వరకుకొనసాగించారు. అంతేకాదు.. దరఖాస్తు చేసుకున్నవారు ఎవరు? నిజమైన వరద బాధితులేనా.? అని పరిశీలించకుండానే దరఖాస్తు చేసుకున్న వారికి చేసుకున్నట్టు గంటల వ్యవధిలో కోట్ల రూపాయలను కుమ్మరించారు. రెండో విషయానికి వస్తే.. కేసీఆర్ తత్వానికి భిన్నంగా.. పన్నుల్లో రాయితీ ప్రకటించారు. అది కూడా సగానికి సగం తగ్గించేశారు. అయితే.. వీటిని గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేశారనే విమర్శలు వస్తాయని అనుకున్నారో.. ఏమో.. మంత్రి కేటీఆర్.. అలాంటి దేమీ లేదని.. ఇప్పట్లో ఎన్నికలు రావని అన్నారు.
కానీ, అనూహ్యంగా ఆయన ఈ మాట అన్న రెండో రోజే. ప్రకటన వచ్చేయడం గమనార్హం. అంతేకాదు.. కమిషనర్ కూడా ఈ వరద సాయాన్ని కొనసాగించవచ్చని ప్రకటించడం మరింత విస్మయం కలిగించింది. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. గ్రేటర్ ఎన్నికల విషయం ముందుగానే కేసీఆర్‌కు తెలిసిపోవడం.. ప్రతిపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేసే క్రమంలో గ్రేటర్ ప్రజల మనసు దోచుకునేందుకు ఆయన కోట్ల రూపాయలనుకుమ్మరించడం వంటివి.. దుబ్బాకలో ఎదురైన ఓటమే కారణమనే విశ్లేషణలు వస్తుండడం గమనార్హం. ఈ నగదు ప్రవాహం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతాయి.. అనేవి తెలుసుకునేందుకు వెయిట్ చేయాల్సిందే!