బోలెడన్ని విశ్లేషణలు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం నువ్వానేనా అన్నట్లుగా సాగినా.. పోలింగ్ మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్లుగా.. టీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు కట్టబెట్టేలా పోలింగ్ జరిగినట్లుగా అంచనాలు వెలువడ్డాయి. వాటికి తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. కాసేపటికే టీవీ స్క్రీన్ల మీద అనూహ్యమైన అంకెలు కనిపిస్తున్నాయి. 150 స్థానాల్లో టీఆర్ఎస్ 12 స్థానాల్లో అధిక్యతలో ఉంటే.. మజ్లిస్ 8 స్థానాల్లో.. ఎవరూ అంచనా వేయలేని రీతిలో బీజేపీ 36 స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో అధిక్యతలో ఉన్నట్లుగా ఫలితాలు చెబుతున్నాయి.
అయితే.. పోలింగ్ ఫలితాల్ని వెల్లడిస్తున్న మీడియా సంస్థలు.. ఒక్కొక్కటి ఒక్కోలాంటి ఫలితాల్నిచూపిస్తున్నాయి మరో ప్రముఖ సంస్థ చూపిస్తున్న ఫలితాల్ని చూస్తే.. టీఆర్ఎస్ 16.. బీజేపీ 43 స్థానాల్లో అధిక్యతలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎమిటీ గందరగోళం? ఊహించని రీతిలో ఈ గణాంకాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి పరిస్థితుల్లో తుది ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇప్పుడు వెలువడిన ఫలితాలు మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో నమోదైన ఓట్లు మాత్రమే అన్నది మర్చిపోకూడదు. పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగులు.. వయసు మీద పడిన వారు.. కోవిడ్ పేషెంట్లతో పాటు.. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ సర్కారు మీద వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ల ఫలితం అదే విషయాన్ని స్పష్టం చేసింది.
అదే సమయంలో.. పెద్ద వయస్కులు సైతం అధికార టీఆర్ఎస్ విషయంలో గుర్రుగా ఉన్నారన్నది తాజా అధిక్యతను చూస్తే అర్థమవుతుంది. ఇదే పరిస్థితి.. పోలింగ్ లోనూ ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే.. ఎన్నికల విజయంలో కీలకమైన బస్తీ ప్రజల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లోకి రావన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కనిపిస్తున్న అధిక్యత.. రౌండ్ రౌండ్ కు మారే అవకాశం ఉండటం ఖాయం. కాకుంటే.. తాజా గణాంకాలు.. ప్రభుత్వం మీద విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకతను చెప్పేసిందని చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్ ఫలితాన్ని చూస్తే అర్థమయ్యేది ఒక్కటే.. తమ ఓట్లతో కారుకు బ్రేకులు వేయటం ద్వారా గులాబీ బాస్ కు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లేనని చెప్పక తప్పదు.