తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి షురూ అయింది. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా మే 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు పార్టీ రంగం సిద్ధం చేసింది. అయితే ఈసారి కడప జిల్లాలో మహానాడు వేడుకలు జరగబోతున్నాయి. మహానాడు సన్నాహాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో మినీ మహానాడులు కూడా ఘనంగా జరుగుతున్నాయి. అయితే పలుచోట్ల మినీ మహానాడు వేడుకల్లో నాయకుల అతి ఉత్సాహం కారణంగా అపశృతులు దొర్లుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే తెరపై రావడంతో.. వైసీపీ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ట్రోల్ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా విశాఖపట్నంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తో పాటు ఆయన కుమారుడు యువనేత గంటా రవితేజ కూడా పాల్గొన్నారు.
గంటా శ్రీనివాసరావు వారసుడిగా పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్న గంటా రవితేజ.. భీమిలి నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే.. మినీ మహానాడులో కూడా రవితేజ సందడి చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలిమాలలు వేసి మినీ మహానాడు వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంటా రవితేజ తనదైన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై రవితేజ చేసిన నినాదాలు విమర్శలకు కారణం అయ్యాయి.
పార్టీ కార్యకర్తల్లో హుషారు నింపే ప్రయత్నంలో `జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సార్.. జోహార్ లోకేష్ అన్న..` అంటూ నినాదాలతో నోరు జారారు రవితేజ. సభలో ఉన్న కొందరు టీడీపీ శ్రేణులు కూడా ఆయన్ను అనుసరించారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించి.. సరి చేయాలని చూశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. రవితేజ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేయడంతో.. చనిపోయిన వారికి చెప్పాల్సిన జోహార్లు బ్రతికున్న చంద్రబాబు, లోకేష్ కు చెప్పడమేంటి అంటూ నెటిజన్లు రవితేజపై ఫైర్ అవుతున్నారు.