ఈసారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టిపోటీనివ్వడంతో పోరు రసవత్తరంగా మారింది. ఇక, అధికార పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారన్న దానిపై మరింత ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా గురువారం నాడు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక పూర్తయింది.
టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి (టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె) గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా టీఆర్ఎస్ కు చెందిన మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోవడంలో ఎంఐఎం తన వంతు పాత్ర పోషించింది. టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతునివ్వడంతో ఎటువంటి డ్రామాకు ఆస్కారం లేకుండానే ఎన్నిక ప్రక్రియ సజావుగా ముగిసింది. తాము ఎవరికీ మద్దతివ్వడం లేదన్న ఎంఐఎం తన పార్టీ సభ్యులను బరిలోకి దించలేదు. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో పని లేకుండానే టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని విజయలక్ష్మి అన్నారు. నగరాభివృద్ధికి అందరి సలహాలూ తీసుకుంటానని, మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని, అవినీతిపై పోరాడుతానని స్పష్టం చేశారు.