ఏపీ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్సీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తోంది. మహిళకు ఫ్రీ బస్సు పథకంపై కూడా కసరత్తులు ప్రారంభించింది.
తాజాగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో మహిళతో పాటు అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందుతూ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీవ్రమైన గుండె జబ్బులు, థలసేమియా, పక్షవాతం, లెప్రసీ, కిడ్నీ, లివర్ సమస్యలు, సీవియర్ హీమోఫి లియా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య 51 వేల వరకు ఉంది.
అయితే దీర్ఘ కాలిక సమస్యలకు చికిత్సల్లో భాగంగా తరచూ ఉన్న చోటు నుంచి పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సి రావడం.. దానికోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధ పడే వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇది నిజంగా ఏపీ ప్రజలకు తీపి కబురే అని చెప్పాలి.