ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రాగా.. వైసీపీకి పాత్రం కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వైసీపీ నుంచి వలసల పర్వం ఊపందుకుంది. వైసీపీకి చెందిన అనేక మంది ముఖ్య నేతలు జగన్ కు వీడ్కోలు పలికి పక్క పార్టీలకు జంప్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీలో నెం.2గా విజయసాయిరెడ్డి ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు. అయినప్పటికీ జగన్ వెనక్కి తగ్గట్లేదు.
పార్టీని బలోపేతం దిశగా నయా ప్లాన్ షురూ చేశారు. లండర్ పర్యటన అనంతరం వరుసగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న సీనియర్ నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ను జగన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సాకే శైలజానాథ్ బాటలోనే నడవబోతున్నారట. త్వరలోనే ఉండవల్లి వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న ఉండవల్లి అరుణ్ కుమార్ కు అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోనున్నారు. కాగా, ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్న ఉండవల్లి.. విభజన సమస్యల పైన పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలను మీడియా ముఖంగా చెబుతూ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ఇక తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి వైసీపీలో చేరితే ఆ పార్టీకి మంచి వాయిస్ లభించినట్లే అవుతుంది.