ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. ఆ ప్రాంతంలో ఆందోళన చోటు చేసుకుంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నర్సీ హిల్స్ లోని ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
తొలుత మూడో అంతస్తులో మొదలైన ఫైర్ యాక్సిడెంట్ చూస్తుండగానే భవనం మొత్తాన్ని అగ్నికీలలు కమ్మేశాయి.
నిమిషాల వ్యవధిలోనే మంటల తీవ్రత ఎక్కువైనట్లుగా అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్నంతనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనున్న భవనాలకు మంటలు వ్యాపించినట్లుగా అధిరారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో ఒక కారును పార్కు చేసి ఉంచగా.. ఆ కారు కూడా తగలబడటం చూస్తే.. మంటల తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. మంటల్ని కంట్రోల్ చేసేందుకు 100 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు.. 20 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.
అయితే.. మంటల కారణంగా బలహీనపడిన భవనం.. చూస్తుండగానే ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలోని భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించటంతో పెను ముప్పు తప్పింది. ప్రమాదానికి గురైన భవనం కొంతకాలంగా ఖాళీగా ఉండటంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఇల్లు లేని వారు కొందరు ఆ భవనంలో ఉన్నా.. అగ్నిప్రమాదం చోటు చేసుకునే వేళకుబయటకు వచ్చేయటంతో పలువురు సేవ్ అయ్యారు. ఈ ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే సిడ్నీలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఉండటం గమనార్హం. ఈ అగ్నిప్రమాదంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.