పది రోజుల క్రితం ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో దాదాపు 300 మందికిపైగా మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరో రైలు ప్రమాదం ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలను కుదిపేసింది. ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ లో మంటలు రేగి మూడు బోగీలు దగ్ధమైన ఘటన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
రైల్లో ప్రయాణికుడు సిగరెట్ తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించడం భోగీలకు మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి లోకో పైలట్ కు సమాచారం అందించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులంతా తమ సామానులు తీసుకొని రైలు నుంచి కిందకు తిరిగి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో s4,S5,s6 బోగీలు దగ్దమయ్యాయి. పూర్తిగా రెండు బోగీలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మైపల్లి- పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనతో సికింద్రాబాద్, గుంటూరు మధ్య పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రైలులో మంటలు, ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.