సీఎం జగన్ పై తక్షణమే కేసు నమోదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీడియాపై దాడులకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మీడియా ప్రతినిధులు జీవించలేని పరిస్థితి కల్పిస్తే.. ఇక, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
ముఖ్యమంత్రి చొక్కాలు మడత పెట్టాలన్న వ్యాఖ్యలతోనే ఇలా దాడులు జరుగుతున్నాయని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్పై తక్షణమే విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోరారు. ఎన్నికలకు రెండు మాసాల ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే పోలీసులు చట్ట ప్రకారం.. నిబంధనల ప్రకారం.. పనిచేయాలని, అధికార పార్టీకి అండగా నిలవొద్దని ఆయన సూచించారు.
లేఖ సారాంశం ఇదీ..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాపై దాడులు పెరిగిపోయాయి.. మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోం ది. మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పై దాడులు నిత్యకృత్యమయ్యాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో కుట్రపూరితంగా వైసీపీ రౌడీలు మీడియాపై దాడులను తీవ్రతరం చేశారు. గత వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు దాడులను డీజేపీకి రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.
అమరావతిలో ఓ పత్రిక విలేకరి పరమేశ్వరరావు, రాప్తాడులో ఓ పత్రిక ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ, కర్నూలులో మరో పత్రిక కార్యాలయంపై దాడి, మద్దికెరలో జర్నలిస్ట్ వీరశేఖర్ పై దాడులు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. చొక్కా చేతులు మడతపెట్టండి అంటూ ముఖ్యమంత్రి జగన్ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడమే రాష్ట్రంలో నేటి పరిస్థితికి కారణం అని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ దాడులను ఖండించకపోగా వాటిని ప్రోత్సహించేలా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ దాడులు జరుగుతున్న కారణంగా సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని డీజేపీని కోరారు.