అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పదవీ విరమణ అగ్రరాజ్యం ఎప్పటికి మర్చిపోలేని దారుణ పరిస్థితులు ఎదుర్కొనే దుస్థితి నెలకొని ఉందా? ట్రంప్ మద్దతుదారులు అమెరికాలోని 50రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు ప్లాన్లు చేస్తున్నారా? ఏ రీతిలో అయితే క్యాపిటల్ హిల్ వద్ద రచ్చ చేశారో.. అదే రీతిలో యాభై రాష్ట్రాల్లోనూ చట్టసభల వద్ద రచ్చ చేయనున్నారా? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. జో బైడెన్ ప్రమాణస్వీకారం వేళ.. హింసాకాండకు అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ట్రంప్ ను గడువుకు ముందే పదవి నుంచి తప్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న మాటను ఆయన అనుచరుల నుంచి వార్నింగ్ లు రావటం గమనార్హం. జనవరి 16 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ వద్ద నిరసనలకు వ్యూహరచన చేశారంటున్నారు.
ఇక.. జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారం చేసే రోజున.. వాషింగ్టన్ లోభారీ నిరసన ప్రదర్శన చేస్తున్నట్ులగా ఎఫ్ బీఐ కార్యాలయం గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా వాషింగ్టన్ లో ఎమర్జెన్సీని ఈ నెల 24 వరకు విధిస్తూ అధ్యక్షుడుట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీ వేళలో స్థానికులకు ఇబ్బంది కలుగకుండా సహాయక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్రజల ప్రాణాలకు.. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దిగనున్నాయి.మొత్తానికి బైడెన్ ప్రమాణస్వీకారం ఏమో కానీ.. ఒత్తిడితో అగ్రరాజ్యం ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పక తప్పదు.