వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతోందని టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలంతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని అసలు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి అందించని రీతిలో సంక్షేమ పథకాలను జగన్ అందిస్తున్నారని, ఏపీ ప్రజలపాలిట ఆయన దేవుడని ఆకాశానికెత్తేస్తుంటారు. వారు చెప్పినట్లు నిజంగా జగన్ కు అంత ప్రజాదరణ ఉంటే…జగన్ పర్యటన సమయంలో పరదాలు కట్టాల్సిన అవసరం లేదన్నది ప్రతిపక్ష నేతల వాదన.
ఈ నేపథ్యంలోనే జగన్ పై ప్రజా వ్యతిరేకత ఉందంటోన్న ప్రతిపక్ష నేతల విమర్శలకు ఊతమిచ్చే ఘటన ఒకటి తాజాగా అనంతపురంలో జరిగింది. అనంతపురంలో జగన్ కు జనం నుంచి షాక్ తగిలింది. అనంతపురం జిల్లాలోని పోతుల నాగేపల్లి వద్ద జగన్ కు రైతుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కొందరు రైతులు ప్రయత్నించారు. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్ కు రైతులు అడ్డుపడ్డారు.
దీంతో, భద్రతా సిబ్బంది రైతులను పక్కకు తప్పించి జగన్ కాన్వాయ్ ని ముందుకు పంపించారు. పేదలకు జగనన్న ఇళ్ల కోసం 200 ఎకరాలు సేకరించారని, కానీ దానికి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. అందుకే, తాము జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని, కానీ పోలీసులు తమను తోసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలోని నార్పలలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, నార్పల నుండి పుట్టపర్తికి జగన్ ను తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తికి ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద జగన్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.