పంటల బీమాకు సంబంధించి సీఎం జగన్మోహన్రెడ్డి తీరుపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు తుఫాన్లు వస్తే.. రైతులు రూ.15 వేల కోట్లు నష్టపోయారు. కానీ బీమా పరిహారం కింద కేవలం రూ.1,800 కోట్లే విదిలిస్తూ.. వేల కోట్లు ఉదారంగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తున్నాయి. ఇందులో కొంత నిజమూ లేకపోలేదు.
ఈ రెండేళ్లలో తుఫాన్ల కారణంగా వాటిల్లిన పంట నష్టంలో పది శాతం కూడా పరిహారం ఇవ్వలేదు. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన తుఫానుకు ఇంతకన్నా తక్కువ పంట నష్టం జరిగినా.. బీమా పరిహారంగా రూ.1,860 కోట్లు ఇచ్చింది.
మొత్తంగా ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం బీమా కింద రూ.4 వేల కోట్లు చెల్లించింది. 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. జగన్మోహన్రెడ్డి వచ్చాక నివర్ తుఫాన్ వల్ల ఎకరా వరి పంటకు రూ.30 వేల చొప్పున నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ రూ.15 వేలేనని లెక్కగట్టింది.
అందులోనూ కోతలేసి చివరకు రూ.4 వేలే ఇచ్చారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా పంట నష్టానికి ఎకరా రూ.30 వేల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కానీ నివర్ తుఫానుకు 17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం ఐదు లక్షల ఎకరాలకే పరిహారం ఇచ్చారు.
పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని 50 నుంచి వంద శాతం వరకూ పెంచింది. జగన్ సర్కారు కేవలం 15 శాతం పెంచింది. రైతులకు చాలా ఇస్తున్నామని చెబుతూ ఇవ్వకపోవడం వల్లే వారు దిక్కులేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్ధానంలో నిలవడానికి ఇది కూడా కారణమని వివిధ కమిషన్ల నివేదికలు చెబుతున్నాయి.
పరిహారం 16 రూపాయలే!
ప్రకృతి విపత్తులకు పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వాలు ప్రకటించే బీమాయే కొంత ధీమా! కానీ కొద్దిరోజుల కింద తమకు విడుదలైన ‘వైఎస్సార్ పంటల బీమా/ప్రధానమంత్రి ఫసల్ బీమా’ డబ్బులు చూసి విశాఖ ఏజెన్సీ రైతులకు దిమ్మ తిరిగింది.
ఓ రైతు 60 సెంట్లలో వరి వేస్తే వరదలకు దెబ్బతింది. పంట నష్టం పరిహారం కింద ఆయనకు రూ.16.80 వచ్చింది. దిగుబడి తక్కువగా వచ్చిందని ఈ ఏజెన్సీలో వేలాదిమంది ఖాతాల్లో రూ.200లోపే డబ్బులు పడ్డాయి. హుకుంపేట మండలంలో దెబ్బతిన్న మొత్తం 168.79 ఎకరాలకుగాను 88 మంది రైతులకు కేవలం రూ.9,260 దక్కింది.
మరో రైతు ఆరెకరాల్లో సాగు చేయగా దిగుబడి తగ్గినందున రూ.1,952 పరిహారం వచ్చింది. మండలంలో ఎక్కువ పరిహారం అందింది ఆయనకే. ఎక్కువ మంది రైతులకు రూ.200 కంటే తక్కువ పరిహారం వచ్చింది. ఎందుకింత తక్కువ ఇచ్చారని నిలదీస్తే.. వ్యవసాయ అధికారుల వివరణ వింతగా ఉంది.
బీమా ఖరారులో పంట దిగుబడిని ప్రామాణికంగా తీసుకున్నామని వారు చెప్పారు. వరికి సంబంధించి ఎకరాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స రూ.35 వేలుగా నిర్ణయించారు. పంట మొత్తం నష్టపోతే అందులో 80 శాతం పరిహారంగా అంటే రూ.28 వేలు ఇచ్చారు.
అధికారులు చెబుతున్న ‘దిగుబడి’ లెక్కలపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వడంలో శాస్త్రీయత లోపించిందని ఆరోపిస్తున్నారు.
ధాన్యం సేకరణలోనూ అంతే..
రబీలో ప్రతి ధాన్యపు గింజనూ కొంటామని ఆర్భాటంగా ప్రకటించిన జగన్ సర్కారు.. ఇప్పటివరకు సగం కూడా కొనుగోలు చేయలేదు. వరి ప్రధానంగా పండే తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదు.
రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నా దిక్కులేదు. నమోదు చేసుకోని రైతుల పేరిట విక్రయాలు జరుగుతుండడం మరో విచిత్రం. రైతు భరోసా పఽథకం అమల్లో కూడా జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని రైతు సంఘాలు అంటున్నాయి.
కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.13,500 ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి తర్వాత దానిని రూ.7 వేలకు కుదించారు. దీనివల్ల ఐదేళ్లలో ఒక్కో రైతు రూ.30 వేలు నష్టపోతున్నారు.