నూతన వ్యవసాయ చట్టాల వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రింకోర్టు నియమించిన నిపుణుల కమిటి తీవ్ర వివాదాస్పదమవుతోంది. కమిటిని సుప్రీంకోర్టు రద్దు చేసి కొత్తగా మళ్ళీ కమిటి వేయాలంటూ భారతీయ కిసాన్ యూనియన్-లోక్ శక్తి శనివారం సుప్రింకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.
మూడు నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం అమల్లోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. చట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తుంటే సవరణలు తప్ప రద్దు ప్రసక్తే లేదని కేంద్రం గట్టిగా చెప్పేసింది.
ఇటువంటి వాదనల వల్లే దాదాపు 53 రోజులైనా రైతులు తమ ఉద్యమాన్ని వీడకపోవటమే కాకుండా మరింత ఉదృతం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొత్త వ్యవసాయ చట్టాల వివాదానికి పరిష్కారం చూపాలని సుప్రింకోర్టు అనుకున్నది. ఇందులో భాగంగానే వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని నలుగురు నిపుణులతో కమిటి వేసింది. కమిటి వేయటమే ఆలస్యం కమిటిలోని వారంతా బ్రోకర్లే అంటూ రైతుసంఘాలు గోల మొదలుపెట్టాయి. దాంతో భూపేందర్ సింగ్ మన్ కమిటిలో నుండి తప్పుకున్నారు.
ఇక మిగిలిన డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అశోక్ గెలాటీ, అనీల్ ఫర్వాత్ ఆలోచనలేమిటో ఇంతవరకు తెలీలేదు. ఈనెల 19వ తేదీన కమిటిలో సభ్యులు సమావేశమవుతున్నారు. ఈ నేపధ్యంలోనే భారతీయ కిసాన్ యూనియన్ కోర్టులో ఓ అఫిడవిట్ వేసింది. కమిటిలోని మిగిలిన సభ్యులను కూడా తీసేసి కొత్తవాళ్ళని నియమించాలని కోరింది. కేంద్ర-రైతుసంఘాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగిద్దామని సుప్రింకోర్టు చూపించిన చొరవ చివరకు నిరుపయోగం అయ్యేట్లుగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కమిటిలో ఎవరిని సభ్యులుగా వేసినా వాళ్ళకి ఏదో ఓ అంశాన్ని అంటడట్టడం ఖాయం. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని సభ్యులుగా నియమిస్తే కేంద్రం ఒప్పుకోదు. అలాగని అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమిస్తే రైతుసంఘాలు అంగీకరించవు. మరలాంటపుడు సమస్య పరిష్కారం ఎలాగ అన్నదే పెద్ద సమస్యగా మారింది. నూతన చట్టాలను రద్దు చేసేదిలేదని కేంద్రం తాజాగా స్పష్టంగా చెప్పేసింది. మరి ఈ పరిస్ధితుల్లో పరిష్కారం ఏమిటో ఎవరికీ అర్ధంకావటం లేదు.