రామ్ గోపాల్ వర్మ…టాలీవుడ్ లో ‘శివ’తో ట్రెండ్ సెట్ చేసిన ఈ విలక్షణ దర్శకుడు కాలక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలతో మరో ట్రెండ్ సెట్ చేసి కాంట్రవర్షియల్ దర్శకుడిగా మారారు. కొందరైతే వివాదమే వర్మకు ముడిసరుకుగా మారిందని, పబ్లిసిటీ కోసమే ఇటీవల వర్మ సినిమాలు, కామెంట్లు ఉంటున్నాయని అంటున్నారు. ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా చూపించడం…చివరకు ప్రేక్షకుడిని నిరాశ పరిచేలా షార్ట్ ఫిల్మ్ లను సినిమాలుగా చూపించే ప్రయత్నం చేయడం వర్మకు పరిపాటి అంటున్నారు.
అందరి కంటే తాను భిన్నంగా ఆలోచిస్తున్నానని.. తన రూటే సపరేట్ అని వర్మ అంటుంటారు. అనుకున్న విషయాన్ని నిస్సందేహం వ్యక్తం చేయడం…తన లాజిక్కులతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడం వర్మకు అలవాటే. వర్మ అంటేనే వివాదం, సంచలనం అనేంతగా ముద్ర పడిందంటే అతిశయోక్తి కాదు. దీంతో, వర్మ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇలా మారారా…లేక చిన్నప్పటి నుంచి ఇంతేనా? అన్న డౌటనుమానం రాక మానదు.
ఈ క్రమంలోనే తాజాగా వర్మ చిన్నప్పుడు ఎలా ఉండేవారన్న సంగతిని ఆయన చెల్లెలు విజయ లక్ష్మి వెల్లడించారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ గురించి ఆమె షాకింగ్ విషయాలు చెప్పారు. వర్మ ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదని అన్నారు. ఓ సినిమాలో రైలును టైం బాంబు పెట్టి పేల్చే సీన్ పై వర్మ చేసిన కామెంట్లు చూసి తాము షాకయ్యామని చెప్పారు. మన దేశంలో రైలు సమయానికి రాదని, అటువంటపుడు ఆ మూవీ డైరెక్టర్ టైమ్ బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడని చెప్పుకొచ్చారు.
9 ఏళ్ల వయసులో వర్మ చెప్పిన ఆ సమాధానం..తమ మామయ్య సహా అందరినీ ఆశ్చర్యపరిచిందని అన్నారు. లాజికల్‌గా థింక్ చేయడం వర్మకు అప్పటి నుంచే అలవాటని అన్నారు. అందరు అనుకున్నట్లు వర్మకు అసలు అమ్మాయిల పిచ్చి లేదని చెప్పారు. చిన్నపుడు నా స్నేహితురాలు కళ్లు చాలా బాగున్నాయని నా ముందే చెప్పేశాడని, కానీ, ఆ అమ్మాయికి మెల్లకన్ను అని చెప్పుకొచ్చారు. ఇదే విషయం వర్మను అడిగితే..ఆ అమ్మాయి కళ్లను తాను దీక్షగా చూడలేదని, ఏదో ఒక మాట అలా అనేశానని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అమ్మాయిలను వర్మ సరదాగా పొగుడుతూ మాట్లాడడమే తప్ప ఏరోజు వారితో మిస్ బిహేవ్ చేసింది లేదని చెప్పుకొచ్చారు.