తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హవా షురూ అయింది. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలలో మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. మరోసారి అధికారం చేపట్టాలన్న బీఆర్ఎస్ ఆశలపై సర్వే సంస్థలు నీళ్లు చల్లాయి. బీఆర్ఎస్ రెండో స్థానానికే పరిమితమవుతుందని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి.
119 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 58 నుంచి 67 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆరా ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. బీఆర్ఎస్ కు 41 నుంచి 49 స్థానాలు దక్కుతాయని ఆ సంస్థ అంచనా వేసింది. బీజేపీకి 5 నుంచి 7 స్థానాలు, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు వస్తాయని చెబుతోంది.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 67 నుంచి 78 స్థానాలు దక్కించునే అవకాశముంది. బీఆర్ఎస్ 22 నుంచి 31 స్థానాలకే పరిమితం కానుంది. బీజేపీ 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం 6 నుంచి 7 స్థానాలు సాధించనున్నాయి. సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 65 స్థానాలు, బీఆర్ఎస్ కు 41 స్థానాలు, బీజేపీకి 4 స్థానాలు, ఇతరులకు 9 స్థానాలు వస్తాయి. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 56 స్థానాలు, బీఆర్ఎస్ 48 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు దక్కించుకోనున్నాయి.