సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతలపై మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత జీవీ హర్ష కుమార్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఆత్మగౌరవంతో బతకలేని మంత్రులకు ఈ వెధవ పదవులు ఎందుకంటూ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు కొద్ది నెలల క్రితం దుమారం రేపాయి. ఒక్క మంత్రికి కూడా జగన్ అప్పాయింట్మెంట్ దొరకదని, సజ్జలతోనే మాట్లాడి సరిపెట్టుకోవాలని హర్షకుమార్ గతంలో షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇక, గతంలో పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ కు శిరోముండనం జరిగి నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని, అతడికి న్యాయం జరిగేలా కోర్టుకు వెళ్తామని కూడా హర్షకుమార్ అన్నారు. తాజాగా మరో దళిత యువకుడిని పోలీసులు వేధిస్తున్నారంటూ హర్ష కుమార్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ సోదరి షర్మిలపై హర్ష కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ చెల్లెలు కులాంతర వివాహం చేసుకున్నా పర్వాలేదని, కానీ ఇతరులు ప్రేమ వివాహం చేసుకుంటే వారిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.
ఒంగోలుకు చెందిన దళితుడైన వినోద్ కుమార్…రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడని, దీంతో, వినోద్ ను పోలీసులు వేధిస్తున్నారని హర్ష కుమార్ మండిపడ్డారు. కులాంతర వివాహాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను జగన్ ఆపేశారని దుయ్యబట్టారు.
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వానిది నాన్చుడు ధోరణి అని ఆరోపించారు. దళితులను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వైసీపీలోని దళిత నేతలంతా ఈ వివక్షపై జగన్ ను నిలదీయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందన్నారు.