వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుపై హత్యారోపణలు వస్తున్న సంగతి ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం రోడ్డుప్రమాదంలో చనిపోయాడని ఉదయ్ భాస్కర్ చెబుతుండగా…హత్య చేశారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఎమ్మెల్సీ ఉదయ్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఉదయ్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ని తీసుకెళ్లి హత్య చేసి, నేరుగా అతడి ఇంటికే శవాన్ని తీసుకొచ్చాడంటే.. అతడికి ఏ స్థాయిలో మద్దతుందో అర్థమవుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ కేసులో హైకోర్టు కలగజేసుకుని సీబీఐ విచారణ ఆదేశించాలని డిమాండ్ చేశారు. తన అక్రమాల గురించి అందరికీ చెబుతున్నాడనే సుబ్రహ్మణ్యాన్ని ఉదయ్ హత్య చేశారని ఆరోపించారు.
ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి, మైనింగ్ అక్రమాలు, రూబీ రాళ్ల ఎగుమతి రహస్యం సుబ్రహ్మణ్యానికి తెలుసని, అందుకే అతడిని హత్య చేశారని అన్నారు. జగన్తో పాటు మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉదయ్ బినామీ అని ఆరోపించారు. అందుకే పోలీసులు అనంతబాబును అరెస్టు చేయటం లేదని ఆరోపించారు. ఉదయ్ వెనుక వైసీపీ పెద్దలు ఉండటంతోనే.., ప్రశ్నించేందుకే పోలీసులు భయపడ్డారన్నారు.
అంతకుముందు, ఎమ్మెల్సీ ఉదయ్ తన పుట్టినరోజని చెప్పి తన భర్తను తీసుకెళ్లారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ ఆరోపించారు. అయితే, ఆయన పుట్టినరోజు నాలుగు నెలల కిందట అయిపోయిందని, అనంతబాబు రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి అన్ని విషయాలూ తన భర్తకు తెలిసినందునే చంపేశారని ఆరోపించారు. తన భర్తను భోజనానికి రమ్మని గతంలో ఎప్పుడూ ఉదయ్ పిలవలేదని, ఆయన అసలు తమ ఇంటికి రాలేదని తెలిపారు.