ఏపీలో వైసిపి అధినేత సీఎం జగన్ మందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బలంగా ప్రచారం జరుగుతోంది. టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. ఏపీలో షెడ్యూల్ కంటే 6 నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, టిడిపి శ్రేణులు సమాయత్తం కావాలని చంద్రబాబు గతంలో చాలా సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
ఎన్నికలు దగ్గర పడే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారే జంప్ జిలానీల హవా మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో హర్ష కుమార్ భేటీ కావడం ఆ పుకార్లకు ఊతమిస్తోంది. పార్టీలోకి హర్ష కుమార్ ను సుభాష్ చంద్ర బోస్ ఆహ్వానించారని, హర్షకుమార్ వైసీపీలో చేరడం లాంఛనమే అని ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అమలాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా గెలిచిన హర్ష కుమార్ కు ఎస్సీ సామాజిక వర్గంతో పాటు, కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గాలలోను మంచి పేరుంది. దీంతో, హర్ష కుమార్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, అమలాపురం ఎంపీగా ఉన్న వైసిపి నేత చింతా అనురాధపై అధిష్టానం అంత సంతృప్తిగా లేదని, అందుకే, హర్ష కుమార్ కు ఛాన్స్ ఇద్దామని భావిస్తోందని తెలుస్తోంది.
అంతేకాకుండా, అనురాధ కూడా అసెంబ్లీ బరిలో దిగాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి హర్షకుమార్ భంగపడ్డారు. తనకు పదవి దక్కకపోవడంతో తనకు కేటాయించిన ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా చేపట్టబోని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు హర్షకుమార్ లేఖ కూడా రాశారు. దీంతో, కాంగ్రెస్ హై కమాండ్ పై అసహనంతో ఉన్న హర్షకుమార్ వైసీపీ ఆఫర్ కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
అయితే, మొన్న మొన్నటివరకు జగన్ ను దళిత ద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో బూతులు తిట్టి విమర్శించిన హర్ష కుమార్…వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.